పుణే: న్యాయ వ్యవస్థలోని కొలీజియం వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శనివారం తీవ్రంగా విమర్శించారు. హైకోర్టు జడ్జిల బదిలీలకు సంబంధించిన నిర్ణయాల స్వతంత్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పుణేలో జీవీ పండిట్ స్మారకోపన్యాసంలో మాట్లాడుతూ, ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ శ్రీధరన్‌ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయనను బదిలీ చేసినట్లు విశ్రాంత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
జస్టిస్ భూయాన్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని బయటపెట్టడమంటే, రాజ్యాంగపరంగా స్వతంత్ర న్యాయ ప్రక్రియ అయిన ఈ ప్రక్రియలో కార్యనిర్వాహక విభాగం జోక్యం చేసుకున్నట్లు స్పష్టంగా అంగీకరించడమేనని చెప్పారు. ఇటువంటి బదిలీలకు ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉండే ఆదేశాలను జారీ చేసినంత మాత్రానికి జడ్జిని ఒక హైకోర్టు నుంచి వేరొక హైకోర్టుకు ఎందుకు బదిలీ చేయాలని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు న్యాయ వ్యవస్థ స్వతంత్రత మూలాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. “న్యాయ వ్యవస్థ స్వతంత్రతను ఇది ప్రభావితం చేయదా? కొలీజియం వ్యవస్థ సమగ్రతకు హానికరం కాదా? ఈ పరిస్థితి చాలా దురదృష్టకరం, వ్యవస్థకు తీవ్ర ఆందోళనకరం” అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయమూర్తులు కొలీజియం ప్రక్రియను కాపాడుకోవాలన్నారు.
న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అంతర్గత సవాళ్లను ప్రస్తావిస్తూ, అందరు వ్యక్తుల మాదిరిగానే న్యాయమూర్తులకు కూడా వ్యక్తిగత రాజకీయ లేదా సైద్ధాంతిక అభిప్రాయాలు ఉంటాయన్నారు. న్యాయపరమైన ఫలితాలను ఈ అభిప్రాయాలు నిర్ణయించకూడదని చెప్పారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జడ్జిని బదిలీ చేసినట్లు కొలీజియం తీర్మానాల్లోనే రాసినపుడు, న్యాయపరమైన ప్రక్రియలో ఇబ్బందికర జోక్యాన్ని బాహాటంగా వెల్లడిస్తున్నదన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు లేదా నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం ఉండకూడదని చెప్పారు. ఇండియాలో రాజ్యాంగమే సర్వోన్నతమైనదని, పార్లమెంటు కాదని తెలిపారు. మరోవైపు, జస్టిస్ శ్రీధరన్ స్వతంత్ర న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన కర్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ శ్రీధరన్ స్వీయ విచారణకు చేపట్టారు.
న్యూఢిల్లీ: ఇండియాలో ఇంతకుముందెన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఐక్య రాజ్య సమితి జాతి వివక్ష నిర్మూలన కమిటీ (సీఈఆర్డీ) ఆరోపించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీలు, అస్సాంలోని బెంగాలీ మాట్లాడే ముస్లింలు, అడవుల్లో నివసించే గిరిజనుల హత్యలు, అరెస్ట్‌లు, బలవంతపు తరలింపులు, భూమి హక్కుల నిరాకరణలను ఉదాహరణగా చూపించింది. జాతి వివక్ష ధోరణితో భద్రత, పౌరసత్వం విధానాలను అమలు చేస్తున్నారని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇది దారుణమైన ఉల్లంఘన అని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 19న లేఖ రాసింది. ప్రభుత్వేతర సాయుధ దళాలను 2026 మార్చి నాటికి నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, దీనివల్ల ఆదివాసీలపై తీవ్రమైన హింస జరుగుతున్నదని తెలిపింది. భద్రతా దళాల కార్యకలాపాల్లో సామాన్యులతోపాటు 500 మంది ఆదివాసీలను హత్య చేశారని పేర్కొన్నది. 2021-2025 మధ్య కాలంలో గ్రామాలు, వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లో గగనతలం నుంచి బాంబులు వేశారని పేర్కొన్నది.