న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఎవరినైనా ఉరితీస్తుంటే తప్ప అదే రోజున కేసుపై విచారణ జరగాలని తాను ఆదేశాలు ఇవ్వనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బుధవారం స్పష్టం చేశారు. న్యాయమూర్తుల బాధ ఎవరికైనా అర్థమవుతోందా అని ప్రశ్నించిన ఆయన.. వారు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో, ఎంతసేపు నిద్రపోతున్నారో ఎవరికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యవసరంగా విచారణ జరపాల్సిన కేసుల లిస్టింగ్ విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతోపాటు ధర్మాసనంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిన్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ఉన్నారు. రోస్టర్ను నిర్వహించాల్సిన బాధ్యత భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ది కాగా సీజేఐ బీఆర్ గవాయ్ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నందున ఆయన తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్యకాంత్పైన రోస్టర్ బాధ్యత పడింది.
రాజస్థాన్లో ఒక ఇంటికి ఈరోజే వేలం జరుగుతోందని, అందుకు సంబంధించిన కేసుపై నేడే అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనాన్ని అర్థించినపుడు జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ఎవరికైనా ఉరిశిక్ష అమలు జరుగుతుంటే తప్ప అదేరోజు కేసును విచారించడం కుదరదని స్పష్టం చేశారు. న్యాయమూర్తుల బాధ మీకు అర్థం కావడం లేదు. మేము ఎన్ని గంటలు పనిచేస్తున్నామో, ఎన్ని గంటలు నిద్రపోతున్నామో మీకు తెలుసా? ఎవరి స్వేచ్ఛకైనా భంగం కలుగుతుంటే తప్ప అదే రోజున కేసుపై విచారణ చేపట్టడం జరగదు అని న్యాయవాదిని ఉద్దేశించి ఆయన తేల్చిచెప్పారు.