న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసచార్ శ్రీషానంద గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన రెండు వీడియోలపై స్పందించింది. ఓ వీడియోలో శ్రీషానంద ఓ మహిళా న్యాయవాదిని మందలిస్తున్నట్లు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు వినిపించింది. మరొక వీడియోలో, ఆ జడ్జి బెంగళూరులోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా అభివర్ణించినట్లు కనిపించింది. సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ ఎక్స్ వేదికగా సీజేఐ దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లారు. దీంతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం శుక్రవారం ఉదయం సమావేశమైంది. రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టును ఆదేశించింది. వచ్చే బుధవారం దీనిపై విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఇటువంటి విషయాలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని చెప్పింది.
‘స్టార్ హెల్త్’పై హ్యాకర్ల పంజా
న్యూఢిల్లీ: దిగ్గజ ఆరోగ్య బీమా సంస్థల్లో ఒకటైన ‘స్టార్ హెల్త్’పై హ్యాకర్లు పంజా విసిరారు. ఆ కంపెనీకి చెందిన 3.1 కోట్ల మందికిపైగా కస్టమర్ల డాటాను తస్కరించారు. కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, మెడికల్ రిపోర్టులు, ఇతర వ్యక్తిగత వివరాలతో కూడిన ఆ సున్నిత సమాచారాన్ని ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’లోని చాట్‌బాట్స్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంచారు. ‘టెలిగ్రామ్’లో నేరపూరిత కార్యకలాపాలను అనుమతిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల ఆ యాప్ వ్యవస్థాపకుడిని అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ‘జెన్జెన్’ అనే టెలిగ్రామ్ చాట్‌బాట్ సృష్టికర్త బ్రిటన్‌కు చెందిన సెక్యూరిటీ రిసెర్చర్ జాసన్ పార్కర్‌కు చెప్పడంతో అతడు ఆ అంశాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ‘స్టార్ హెల్త్’ స్పందిస్తూ సమస్యను పరిష్కరించేందుకు దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపింది.