Supreme Court | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఇటీవల హైడ్రామా నడుమ జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ సమయంలో ప్రిసైడింగ్ అధికారి వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలపై ఏదో రాసి వాటిని పాడు చేసినట్టు ఎన్నికల ప్రక్రియ వీడియోను చూస్తే స్పష్టమవుతున్నని పేర్కొన్నది.
ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని, ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యం హత్యకు గురికావడాన్ని తాము ఎంతమాత్రం అనుమంతించబోమని స్పష్టం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల తీరును సవాల్ చేస్తూ ఆప్ కౌన్సిలర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికల సందర్భంగా తీసిన వీడియోను ఈ సందర్భంగా కోర్టు పరిశీలించింది. తదుపరి విచారణ జరిగే ఈ నెల 19న ప్రిసైడింగ్ అధికారి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చండీగఢ్ మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీచేసింది.
కెమెరా వైపే ఎందుకు చూస్తున్నారు?
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీజేఐ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆయన (ప్రిసైడింగ్ అధికారి) అధికారా? నేరస్తుడా? మిస్టర్ సొలిసిటర్ జనరల్.. చూడండి, ఆయన ఎందుకు కెమెరా వైపు చూస్తున్నారు? ఇది ప్రజాస్వామ్య ఖూనీనే. రిటర్నింగ్ అధికారి ఇలాగేనా వ్యవహరించేది? సుప్రీంకోర్టు చూస్తున్నదని ఆయనకి చెప్పిండి. ఆయన తీరుపై న్యాయ విచారణ జరిపించాలి’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఎన్నికల ప్రక్రియ వీడియోను చూసిన తర్వాత వ్యాఖ్యానించారు.
మేయర్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, వీడియో రికార్డింగులను భద్రపరచాలని పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగలేదని భావిస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ నెల 7న జరుగాల్సిన చండీగఢ్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని ఆదేశించింది. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ పిటిషన్ విషయంలో సరిగ్గా స్పందించలేదని, కేసు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.
కోర్టు వ్యాఖ్యలు.. బీజేపీకి చెంపపెట్టు
కాగా, చండీగఢ్ మేయర్ ఎన్నికల తీరుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బీజేపీకి చెంపపెట్టు లాంటివని ఆప్, కాంగ్రెస్ పేర్కొన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఆ పార్టీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన ఆప్ ఎంపీ సందీప్ పాఠక్.. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.