న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రేబిస్ వ్యాధి కేసులు ఎక్కువవుతున్నాయి. వీధికుక్కలు కరవడం వల్ల పిల్లలు, వృద్ధుల్లో ఈ వైరస్ సోకుతోంది. కుక్క కాటు వల్ల ప్రాణాంతక పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దినపత్రికకు చెందిన ఢిల్లీ ఎడిషన్‌లో వీధికుక్కల గురించి ఓ కథనాన్ని ప్రచురించారు. ఆ కథనం ఆధారంగా ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) సుమోటో కేసును స్వీకరించింది.
జస్టసి్ జేబీ పర్దివాలా, ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం ఆ పత్రిక కథనం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. వీధి కుక్కలు కరవడం వల్ల ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందిపడుతున్నారని, వాళ్లకు రేబిస్ వ్యాధి సోకుతున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఆ కథనం చాలా డిస్టర్బింగ్‌గా ఉందని, ఆ కథనంలో ఉన్న వివరాలు చాలా ఆందోళన కలిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
నగరంలో వందల సంఖ్యలో కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నాయని, వీటి వల్ల రేబిస్ ఇన్ఫెక్షన్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల చిన్నారులు, సీనియర్ సిటిజన్లు ఆ వ్యాధికి బలి అవుతున్నారని కోర్టు చెప్పింది. సుమోటోగా స్వీకరించిన ఈ అంశాన్ని.. సీజేఐ బీఆర్ గవాయ్ ముందు ఉంచనున్నట్లు ధర్మాసనం తెలిపింది.