Krishna Janmabhoomi | యూపీ మథుర శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలోని అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంబంధించిన పిటిషన్‌పై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపనున్నది. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించనున్నది. ఈ నెల 16న రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేతలపై సుప్రీంకోర్టు పది రోజుల పాటు స్టే విధించిన విషయం తెలిసిందే. కూల్చివేతలను వ్యతిరేకిస్తూ యాకుబ్ షా అనే వ్యక్తి సుప్రీంను ఆశ్రయించగా.. స్పందన తెలుపాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయితే, 1800 సంవత్సరాల నాటి నుంచి ప్రజలు అక్కడ ఉంటున్నారని, రైల్వే అధికారుల చర్యతో అక్కడ ఇండ్లు నిర్మించుకున్న సుమారు 3వేల మందిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పిటిషనర్ ఆరోపించారు. అయితే, వందే భారత్ వంటి రైళ్ల నిర్వహణ, మథుర నుంచి బృందావన్ వరకు ఉన్న 21 కిలోమీటర్ల దూరాన్ని నారోగేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌గా మార్చేందుకు కూల్చివేతలు చేపడుతున్నట్లు రైల్వే అథారిటీ తెలిపింది. అయితే, ఈ నెల 9న కూల్చివేతలను రైల్వే అధికారులు చేపట్టగా.. పలువురు మథుర సివిల్ కోర్టు డివిజన్లో సివిల్ వేశారు. మరో వైపు రైల్వే అధికారులు రైల్వేట్రాక్‌తో పాటు 135 ఇండ్లను కూల్చివేశారు. మథుర సివిల్ కోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్నా.. కూల్చివేతలు చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ ఆరోపించారు.