న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. గత నెలాఖరులో మేయర్ ఎన్నికలను నిర్వహించిన రిటర్నింగ్ అధికారి అనిల్ మసిహ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. పలువురు కౌన్సిలర్లు ఓటు వేసిన కొన్ని బ్యాలెట్ పేపర్లపై ‘ఎక్స్(x)’ మార్క్ ఎందుకు వేశారని సూటిగా ప్రశ్నించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఏదైనా తప్పు జరిగి ఉంటే రిటర్నింగ్ అధికారి విచారణకు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. బ్యాలెట్ పత్రాలపై రాతలు గీయడం ఎన్నికల ప్రజాస్వామ్యంలో అనుమతించదగ్గది కాదని పేర్కొన్నది. మేయర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్‌కు సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను మంగళవారం పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది. ‘ఇది చాలా తీవ్రమైన అంశం. ఏదైనా తప్పు జరిగి ఉంటే, మిమ్మల్ని(రిటర్నింగ్ అధికారి) ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం పేర్కొన్నది. ‘కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? బ్యాలెట్ పత్రాలపై ‘x’ మార్క్ ఎందుకు వేశారు?’ అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి రిటర్నింగ్ అధికారి సమాధానమిస్తూ.. ఆ బ్యాలెట్ పత్రాలు అప్పటికే చెల్లనివని, తాను వాటిపై గుర్తు మాత్రమే వేశానని చెప్పారు. బ్యాలెట్ పత్రాలపై ‘x’ మార్క్ వేసినట్టు అంగీకరించిన అనిల్, అవి మిగతా వాటితో కలిసి పోకుండా ఉండేందుకే తాను ఆ పని చేశానని పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందగా న్యాయస్థానం.. ‘సంబంధిత నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రాలపై మీరు సంతకం మాత్రమే చేయగలరు! కానీ ‘x’ మార్క్ ఎందుకు వేశారు?’ అని ప్రశ్నించింది. మంగళవారం కోర్టు విచారణకు రావాలని సీజేఐ ధర్మాసనం రిటర్నింగ్అధికారిని ఆదేశించింది.