న్యూఢిల్లీ : రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రతిభ కన్నా ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతికి అధిక ప్రాధాన్యం లభిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు కూడా మనుషులేనని, కొన్ని సార్లు వారు కూడా తప్పు చేస్తారని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.
న్యాయస్థానం తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత డిఫెన్స్ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్పైన ఉందని ధర్మాసనం పేర్కొంది. తప్పు చేసే వారి నుంచి అమాయకులను రక్షించి వారికి న్యాయం చేసే లక్ష్యంతో పనిచేసే న్యాయమూర్తులు నడిపే రథానికి న్యాయాధికారులు ముఖ్యమైన చక్రాలలో ఒకటని వారు తెలిపారు. ప్రతిభ ఆధారంగానే ఏజీపీలు, ఏపీపీలును నియమించాలన్నదే ఈ తీర్పు ఇచ్చే సందేశమని ధర్మాసనం స్పష్టం చేసింది.