న్యూఢిల్లీ : వ్యాపార వివాదాల్లో ట్రిబ్యునళ్లు ఇచ్చే ఆర్బిట్రల్ అవార్డులను సవరించే అధికారం కోర్టులకు ఉందని సుప్రీంకోర్టు బుధవారం 4:1 మెజారిటీ తీర్పు చెప్పింది. మధ్యవర్తిత్వం, రాజీ చట్టం, 1996 ప్రకారం ఆర్బిట్రల్ అవార్డులను కొన్ని పరిస్థితుల్లో సవరించవచ్చునని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీహ్ ఇచ్చిన రూలింగ్‌లో చెప్పారు. అయితే, ఆర్బిట్రల్ అవార్డులను సవరించేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సీజేఐ చెప్పారు. వీటిని సవరించేందుకు రాజ్యాంగంలోని అధికరణ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు లభించిన ప్రత్యేక అధికారాలను వర్తింపజేయవచ్చునని తెలిపారు. చెల్లుబాటయ్యే దానిని, చెల్లుబాటు కాని దానిని వేరు చేయగలిగినపుడు, తప్పుగా కనిపించే క్లరికల్, కంప్యూటేషన్ లేదా టైపోగ్రాఫికల్ తప్పులను సరిదిద్దేందుకు ఈ అధికారాన్ని వినియోగించవచ్చునని తెలిపారు. ఈ తీర్పునిచ్చిన ధర్మాసనంలోని జస్టిస్ కేవీ విశ్వనాథన్ మాత్రం ఆర్బిట్రల్ అవార్డులను సవరించే అధికారం కోర్టులకు లేదని పేర్కొన్నారు.