Supreme Court | న్యూఢిల్లీ, ఆగస్టు 22: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దని కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాల తరపు న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. గురువారం కోల్‌కతా ఘటనపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా కేంద్రం తరపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబల్ మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా కోర్టు చర్యలు తీసుకోవాలని కపిల్ సిబల్ కోరగా తుషార్ మెహతా స్పందిస్తూ..‘పశ్చిమ బెంగాల్ మంత్రి ప్రకటన మా దగ్గర ఉంది.
వారి లీడర్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వేళ్లు నరికేస్తామని చెప్పారు.’ అని వ్యాఖ్యానించారు. దీనికి కపిల్ సిబల్ బదులిస్తూ.. ‘నేను కూడా బెంగాల్ ప్రతిపక్ష నేత ప్రకటన చదువుతా. బుల్లెట్లు పేలుతాయని సువేందు అధికారి అన్నారు’ అని పేర్కొన్నారు.
దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. ‘దయచేసి దీనిని రాజకీయం చేయకండి. వేగవంతమైన, సమర్థమైన విచారణ తర్వాత చట్టం తన పని తాను చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా, వాదనల సందర్భంగా కపిల్ సిబల్ నవ్వారని ఆరోపిస్తూ తుషార్ మెహతా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ గురువారం ఉదయం దర్యాప్తు పురోగతిపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఘటన జరిగిన ఐదో రోజున సీబీఐ దర్యాప్తు బాధ్యతను తీసుకుందని, అప్పటికే క్రైమ్ సీన్‌ను మార్చేసినట్టు సీబీఐ తరపున తుషార్ మెహతా పేర్కొన్నారు. బాధితురాలి తండ్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టుబట్టినా వినలేదని, అంత్యక్రియలు పూర్తైన తర్వాత రాత్రి 11.45కు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. ఇది నేరాన్ని కప్పిపెట్టే ప్రయత్నమే అని అన్నారు.
మృతురాలి కుటుంబాన్ని తప్పుదోవ పట్టించారని, వారి కూతురు ఆత్మహత్య చేసుకుందని బెంగాల్ పోలీసులు చెప్పారని తెలిపారు. అయితే, అంతా వీడియో తీశారని, క్రైమ్ సీన్ ఏమీ మార్చలేదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో ఆర్జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతించింది.
ట్రైనీ డాక్టర్‌ది అసహజ మరణమని కేసు నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం జరిపేయడం తీవ్రంగా కలవరపరుస్తున్నదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఈ ఘటనను మొదటిసారి నమోదు చేసిన పోలీస్ అధికారి విచారణకు రావాలని ధర్మాసనం ఆదేశించింది. ఘటన జరిగినట్టు ఉదయం 10.10 గంటలకు జనరల్ డైరీలో నమోదైతే క్రైమ్ సీన్‌ను భద్రపర్చడం, ఆధారాలను సీజ్ చేయడం వంటివి రాత్రి 11.30కు చేయడం తీవ్రమైన విషయమని కోర్టు వ్యాఖ్యానించింది.
‘ఈ కేసులో మీ రాష్ట్రం(బెంగాల్) పాటించిన మొత్తం ప్రక్రియను నా 30 ఏండ్ల వృత్తి జీవితంలో ఎన్నడూ చూడలేదు’ అని కపిల్ సిబల్‌ను ఉద్దేశించి జస్టిస్ పార్దివాలా వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎందుకు 14 గంటల సమయం పట్టిందని కపిల్ సిబల్‌ను సీజేఐ ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి వారం లోగా అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో మాట్లాడి వైద్యుల భద్రతకు భరోసా కల్పించాలని సూచించింది. తాము ఏర్పాటుచేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ అందరి సూచనలు తీసుకొని వైద్యుల భద్రత కోసం ఒక జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందిస్తుందని పేర్కొన్నది.