న్యూఢిల్లీ, మే 23: ఫామ్ 17సీ ఆధారంగా ఏయే పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే వివరాలు బయటకు వెల్లడించడం ద్వారా ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఫామ్ 17సీని నిబంధల ప్రకారం పోలింగ్ ఏజెంట్‌కు మాత్రమే ఇవ్వాలని, ఇతరులకు ఇవ్వడానికి, బహిర్గతం చేయడానికి నిబంధనలు ఒప్పుకోవని పేర్కొన్నది. తుది పోలింగ్ శాతం వెల్లడించడంలో ఈసీఐ ఆలస్యం చేస్తున్నదని, నియోజకవర్గాలవారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాన్ని ప్రకటించడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లో పోలింగ్ కేంద్రాలవారీగా పోలైన ఓట్ల సంఖ్యతో సహా తుది డాటాను ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్మ్స్(ఏడీఆర్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను గత వారం విచారించిన కోర్టు.. స్పందనను తెలియజేయాల్సిందిగా ఈసీని ఆదేశించింది. దీంతో బుధవారం సుప్రీంకోర్టులో ఈసీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఫామ్ 17సీని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే దానిని మార్ఫింగ్ చేసే అవకాశం ఉంటుందని, ఇది పోలింగ్ డాటాపై నమ్మకాన్ని పోగొట్టే ప్రమాదం ఉందని, అసౌకర్యానికి కారణమవుతుందని ఈసీ పేర్కొన్నది. కాగా, పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెబ్సైట్లో పెట్టడానికి నిరాకరిస్తున్న ఎన్నికల సంఘం తీరే రాజకీయ పార్టీలకు అనుమానాలకు తావిస్తున్నదని, ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పేర్కొన్నారు. పోలైన ఓట్ల పూర్తి డాటాను ఈసీ నిస్సిగ్గుగా దాచి పెడుతున్నదని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించారు.