న్యూఢిల్లీ, ఆగస్టు 21 : లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. జ్యుడీషియల్ పరీక్ష రాసేందుకు న్యాయవాదిగా తప్పనిసరిగా మూడేండ్లు న్యాయవాద వృత్తిని చేసి ఉండాలనే నిబంధనను సడలించింది. దానిని ఏడాదికి తగ్గించినట్టు ప్రకటించింది. అయితే ఎన్నికైన అభ్యర్థులు జ్యుడీషియల్ అకాడమీలో శిక్షణ, తర్వాత ఏడాది పాటు క్లర్క్‌షిప్ చేయాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌లు ఎంజీ మసీహ్, కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం 2:1తో భిన్న నిర్ణయాన్ని ప్రకటించాయి.
ప్రాథమిక స్థాయి జ్యుడీషియల్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా మూడేండ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలని అప్పటి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది మే 20న ప్రకటించి, దానిని అమలు చేస్తున్నది. అయితే దానిని మార్పు చేస్తూ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది.