న్యూఢిల్లీ: ఫిబ్రవరి 15వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఒక్కసారిగా ఫ్లాట్‌ఫాంపై విరుచుకుపడడంతో ఆ తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో సుమారు 18 మంది మరణించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటీషన్ దాఖలైంది. ఆనంద్ లీగల్ ఎయిడ్ ఫోరం ట్రస్టు ఆ పిటీషన్ వేసింది. మరణాల సంఖ్యను రైల్వే శాఖ దాచిపెడుతున్నట్లు ఆ లీగల్ సంస్థ తన పిటీషన్లో ఆరోపించింది.
అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో సుమారు 200 మంది మరణించినట్లు పిటీషనర్ తన ఫిర్యాదులో ఆరోపించారు. విచారణ సమయంలో పిటీషనర్ను సుప్రీం ప్రశ్నించింది. మీరు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందా అని కోర్టు అడిగింది. 200 మరణాలు సంభవించినట్లు చెబుతున్న నేపథ్యంలో.. దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని కోర్టు నిలదీసింది. కొంత సమయం విచారణ జరిగిన తర్వాత కోర్టు .. ఆ పిటీషన్‌ను కొట్టివేసింది. బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించే వరకు వేచి చూద్దామని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.