న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల(Bhojshala)లో ఉన్న వివాదాస్పద సరస్వతీ దేవి గుడి స్థలం వద్ద శుక్రవారం పూట ప్రార్థనలు జరుపుకునేందుకు ముస్లింలకు సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. వివాదాస్పద ప్రాంతానికి పక్కలో ముస్లింలకు కొంత స్థలాన్ని ప్రార్థనల కోసం కేటాయించాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఆ స్థలంలో శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ముస్లింలు నమాజ్ చేసుకోవాలని కోర్టు సూచించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అయితే ప్రస్తుతం వేర్వేరు పిటీషన్లపై వాదనలు జరుగుతున్నాయని, కానీ అడ్‌హక్ పద్ధతిలో ముస్లింలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
తమ అనుమతి లేకుండా వివాదాస్పద భోజ్‌శాల ఆలయ స్థలంలో ఎటువంటి నిర్మాణాలను చేపట్టరాదు అని పురావాస్తు శాఖకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. భోజ్‌శాల చాలా సున్నితమైన అంశమని, హిందువులు.. ముస్లింలు సంయమనంతో ఉండాలని, ఈ సమస్యను పరిష్కరించేందుకు రోజువారీగా వాదనలు చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల- కమలా మౌలా మసీదు ఆవరణలో సరస్వతీదేవి ఆలయం ఉన్నదని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే.