న్యూఢిల్లీ: మణిపూర్‌లో తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర సర్కార్‌ను ఆదేశించింది. అల్లర్ల బాధితులకు పునరావాసం ఏర్పాట్లు, శాంతి భద్రతల మెరుగు, ఆయుధాల స్వాధీనానికి ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ధర్మాసనం కోరింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మైనారిటీ కుకీ తెగల సంఘాల తరపు న్యాయవాది కొలిన్ గంజాల్వేస్ ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తున్నదని, దీనికి మతం రంగు పులమడాన్ని విడనాడాలని కోరారు. కుకీలను కొండల నుంచి తరిమేస్తారని టీవీ చర్చల్లో బెదిరిస్తున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కుకీలపై దాడులు తగ్గాయని ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు నివేదించిన తర్వాతనే తమ వారిపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. కొందరు కుకీ మిలిటెంట్ల వద్ద రైఫిళ్లు ఉన్నాయని, దీనికి కేంద్రమే సమాధానం చెప్పాలని మైతీ వర్గం న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని దీనిపై దృష్టి సారించాలని ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌ను కోరింది. కాగా, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో సోమవారం కాల్పులు చోటు చేసుకున్నాయి.