Supreme Court | హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం ఉందని పేర్కొంటూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. లోక్పాల్ ఇచ్చిన ఆదేశాలపై ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేసింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో లోక్పాల్ రిజిస్ట్రార్, హైకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి సైతం నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి, హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై వచ్చిన ఫిర్యాదును లోక్పాల్ విచారించింది.
లోకాయుక్త చట్టం 2013 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం ఉందంటూ జనవరి 27న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. లోక్పాల్ ఉత్తర్వులపై స్టే ఇచ్చిన కోర్టు.. సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బహిర్గతం చేయొద్దని, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం ఆదేశించింది. న్యాయమూర్తి పేరును గోప్యంగా ఉంచాలని ఫిర్యాదుదారుడికి స్పష్టం చేసింది. కేసు విచారణను మార్చి 18 వరకు వాయిదా వేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు లోక్పాల్, లోకాయుక్త చట్టం 2013 పరిధిలోకి ఎప్పటికీ రారని స్పష్టం చేశారు.
జనవరి 27న, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని లోక్పాల్ తన ఉత్తర్వులో లోక్పాల్ చట్టం ప్రకారం.. హైకోర్టు న్యాయమూర్తులు కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. ఓ ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కేసులో సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి అదనపు జిల్లా న్యాయమూర్తి, మరొక హైకోర్టు న్యాయమూర్తిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. లోక్పాల్ ఆదేశాలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతున్నది. లోక్పాల్ వివరణ సైతం కోరింది.