న్యూఢిల్లీ, నవంబర్ 19 : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం, 2021ని బుధవారం సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. చట్టంలోని కీలక నిబంధనలపై తీవ్ర అభ్యంతరం తెలియచేస్తూ గతంలో న్యాయస్థానం కొట్టివేసిన నిబంధనలను స్వల్ప మార్పులతో కేంద్రం పునరుద్ధరించిందని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. పిటిషనర్లు సవాలు చేసిన చట్టంలోని నిబంధనలు అధికారాల విభజన సూత్రాలను, న్యాయవ్యవస్థ స్వేచ్ఛను ఉల్లంఘించాయని, ఈ కారణంగా వీటిని కొనసాగించడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రిబ్యునళ్ల సంస్కరణల ఆర్డినెన్సును, 2021 చట్టానికి చెందిన నిబంధనలను న్యాయస్థానం అధ్యయనం చేసిందని, గతంలో కొట్టివేసిన నిబంధనలనే స్వల్ప మార్పుతో మళ్లీ తీసుకువచ్చినట్లు గుర్తించిందని ధర్మాసనం తెలిపింది. గతంలో ఇచ్చిన తీర్పులలో గుర్తించిన లోపాలను పరిష్కరించకుండా న్యాయపరమైన సాంప్రదాయాలను శాసనపరంగా అతిక్రమించడానికి పార్లమెంట్ ప్రయత్నించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
పెండింగ్ కేసులను పరిష్కరించడం కేవలం న్యాయవ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు కూడా ఆ బరువును పంచుకోవలసి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన స్వేచ్ఛను పరిరక్షించేందుకు ట్రిబ్యునళ్లను దెబ్బతీసే చట్ట నిబంధనలు న్యాయవ్యవస్థ ఆదేశాలను గౌరవించాలని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం, 2021ని సవాలు చేస్తూ మద్రాసు బార్ అసోసియేషన్, కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. తీర్పు ఇచ్చిన రోజు నుంచి నాలుగు నెలల్లో జాతీయ ట్రిబ్యునల్ కమిషన్ని కేంద్రం నెలకొల్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రిబ్యునళ్ల నిర్వహణ, నియామకాలు, పరిపాలనలో స్వేచ్ఛ, పారదర్శకత, ఏకరూపత ఉండేందుకు నిర్మాణాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ సభ్యుల పదవీ కాలంపై తన ఇదవరకటి ఆదేశాలను కోర్టు పునరుద్ధరిస్తూ ఇన్కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ), కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సీటీఎస్టీఏటీ) సభ్యులు 62 ఏళ్ల వయసు వరకు పదవిలో కొనసాగతారని, వాటి చైర్పర్సన్లు, అధ్యక్షులు 65 ఏళ్ల వయసు వరకు కొనసాగతారని ధర్మాసనం తెలిపింది.