న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సులకు ఆమోదం తెలుపడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం ఆందోళన కలిగిస్తున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కొలీజియం సిఫార్సులపై కేంద్రం జాప్యం చేస్తుండటంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషన్‌దారుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ… కొలీజియం సిఫార్సుల్లో కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసుకొని నియామకాలు, బదిలీలను కేంద్రం చేపడుతున్నదని, ఈ తరహా పద్ధతి కొనసాగడానికి వీలు లేదని, అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. తాము కూడా ఈ విషయం పట్ల ఆందోళన చెందుతున్నట్టు పేర్కొంది.
పరిస్థితిలో కొంత పురోగతి కనిపించినా, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని అభిప్రాయపడింది. కాగా, అటార్నీ జనరల్ అందుబాటులో లేనందున కేసు విచారణను కోర్టు మార్చి రెండో వారానికి వాయిదా వేసింది. అప్పటిలోగా ‘ఏవైతే పూర్తి చేయాల్సి ఉందో అవి పూర్తి చేయండి’ అని కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం మౌఖికంగా సూచించింది.