న్యూఢిల్లీ: ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అ రాధే, పాట్నా హైకోర్టు సీజే జస్టిస్ విపుల్ ఎం పంచోలీలను సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలని కోరింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్‌లు సూర్యకాంత్, విక్రమ్‌నాథ్, జేకే మహేశ్వరి, బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. వీరిద్దరి నియామకంతో జడ్జిల సంఖ్య 34కు చేరుతుంది. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి సీజేఐ పదవిని చేపడితే, 2031 మే నెలలో పదవీ విరమణ చేస్తారు. ఆయన తర్వాత సీజేఐగా జస్టిస్ పంచోలీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది.
జస్టిస్ అరాధే అనేక హైకోర్టుల్లో సేవలందించారు. ఆయన ముఖ్యంగా సివిల్, కాన్స్టిట్యూషనల్, ఆర్బిట్రేషన్, కంపెనీల సంబంధిత వ్యాజ్యాలకు న్యాయవాదిగా మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2007 ఏప్రిల్‌లో సీనియర్ అడ్వకేట్‌గా డిజిగ్నేట్ అయ్యారు. 2009 డిసెంబరులో మధ్య ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరిలో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016 సెప్టెంబరులో జమ్ముకశ్మీరు హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఈ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారు. 2018 నవంబరులో ఆయన కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2022 జూలై-అక్టోబరు మధ్య కాలంలో ఈ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2023 జూలైలో నియమితులయ్యారు. ఓ ఏడాది తర్వాత బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
జస్టిస్ పంచోలీ గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఏడేళ్లపాటు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 2014 అక్టోబరులో గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016 జూన్‌లో పర్మనెంట్ జడ్జి అయ్యారు. 2023 జూలైలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2025 జూలైలో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.