న్యూఢిల్లీ: కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీశానంద ఇటీవల ఓ కేసు విషయంలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు(Supreme Court) తప్పుపట్టింది. బెంగుళూరులోని ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని పాకిస్థాన్ పేరుతో పోల్చుతూ జస్టిస్ శ్రీశానంద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా లాయర్‌పై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్నీ సుమోటో కేసుగా సుప్రీంకోర్టు స్వీకరించింది. ఆ కేసులో ఇవాళ అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ శ్రీశానంద క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో కేసును మూసివేస్తున్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. కానీ భారత భూభాగంలోని ఓ ప్రాంతాన్ని.. పాకిస్థాన్ పేరుతో పిలవడాన్ని మాత్రం సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, సూర్య కాంత్, హృషికేశ్ రాయ్ ఉన్నారు. కేసు తీర్పు సమయంలో జడ్జీలు, లాయర్లు వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేసే అంశంలో అప్రమత్తంగా ఉండాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది. సోషల్ మీడియా యుగంలో జడ్జీలు ఏం మాట్లాడినా వాటి ప్రభావం తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయని, అందుకే నిష్పక్షపాతంగా న్యాయాన్ని వెల్లడిస్తున్నపుడు వ్యక్తిగత అభిప్రాయాలకు ఛాన్స్ ఇవ్వకూడదన్నారు.