న్యూఢిల్లీ, ఆగస్టు 19: బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణం కేసుల విచారణలపై ఎలాంటి స్టే విధించవద్దని, నిందితులకు హక్కులకు ప్రతికూల నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వారి పెండింగ్ అప్పీళ్లను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు బుధవారం ఢిల్లీ హైకోర్టును కోరింది. కొన్ని బొగ్గు కుంభకోణం కేసుల్లో నిందితులు ఉపశమనం కోసం హైకోర్టును ఆశ్రయించగా, మరికొన్ని కేసుల్లో సుప్రీంకోర్టును ఆశయించిన విషయాన్ని గుర్తించిన తర్వాత సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఎటువంటి మధ్యంతర స్టే మంజూరు చేయలేదు.
అటువంటి పిటిషన్లపై సాధ్యమైనంత వరకు నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశిస్తున్నాము అని ధర్మాసనం ఉత్తర్వు జారీ చేసింది. బొగ్గు బ్లాక్ కేటాయింపుల కుంభకోణం కేసులలో ప్రత్యేక కోర్టు ఉత్తర్వుల నుంచి ఉత్పన్నమయ్యే అప్పీళ్లను సుప్రీంకోర్టులోనే దాఖలు చేయాలన్న తన 12 ఏండ్ల క్రితం నాటి ఉత్తర్వును గత నెలలో సడలించిన సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పులను సవాలు చేస్తూ ప్రాసిక్యూషన్, నిందితులు ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు 1993, 2010 మధ్య కేంద్రం కేటాయించిన 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను 2014లో రద్దు చేయడంతో పాటు ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ద్వారా విచారణ జరపాలని ఆదేశించింది. అప్పీళ్లను ఢిల్లీ హైకోర్టులో కాకుండా కేవలం సుప్రీంకోర్టులోనే దాఖలు చేయాలని, హక్కులకు భంగం రావొద్దని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది.