న్యూఢిల్లీ, జూలై 22: హిందూ ఆలయాలను ప్రభుత్వాల అజమాయిషీ నుంచి తప్పించాలని ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దేవుడి మాన్యాల విషయంలోనూ అన్ని మతాలకు ఏకరీతి నిబంధనలు అమలు చేయాలన్నారు. ‘ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు తమ మత సంస్థలను ఏర్పాటు చేసుకొని సొంతంగా నిర్వహించుకోవడానికి హక్కు ఉన్నట్టే హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు కూడా హక్కు ఉండాలి. ఏ మతానికైనా తమ మత సంస్థలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకొనే హక్కు ఆర్టికల్ 26 ప్రకారం రాజ్యాంగం కల్పించింది. ప్రభుత్వం ఈ హక్కును దూరం చేయవద్దు’ అని అశ్వినీ కుమార్ పిల్లో పేర్కొన్నారు. దేశంలో 9 లక్షల గుడుల్లో 4 లక్షలకు పైగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయన్నారు. అదే సమయంలో ఒక్క చర్చ్, ఒక్క మసీదు కూడా ప్రభుత్వం నియంత్రణలో లేదని పేర్కొన్నారు.