న్యూఢిల్లీ, మార్చి 11: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి అదనపు సమయం ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బ్యాంకు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. నేడు (మంగళవారం) సాయంత్రంలోగా కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి వివరాలు వెల్లడించాల్సిందేనని ఆదేశించింది.
బ్యాంకు అందించిన వివరాలను ఈ నెల 15న సాయంత్రం 5 గంటలలోగా తమ అధికారిక వెబ్సైట్లో బహిర్గతపరచాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తాము నిర్దేశించిన గడువును, ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే.. గత నెల 15న తాము ఇచ్చిన తీర్పు పట్ల ‘ఉద్దేశపూర్వకమైన అవిధేయత’గా పరిగణించి బ్యాంకుపై చర్య తీసుకోవడానికి వెనుకాడబోమని ఎస్బీఐని హెచ్చరించింది.
ఉద్దేశపూర్వక అవిధేయత..
గత నెల 15న ఓ చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు.. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు సమకూర్చేందుకు వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని ప్రకటించిన న్యాయస్థానం.. ఆయా నిధులు ఇచ్చిన దాతల పేర్లను, వాటిని అందుకున్న పార్టీల వివరాలను ఈ నెల 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి తెలియపరచాలని ఆదేశించింది.
బ్యాంకు అందించిన వివరాలను ఈ నెల 13లోగా ప్రజల ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తమ వద్దనున్న వివరాలను ఎన్నికల సంఘానికి అందజేసేందుకు మరింత గడువు కావాలని ఎస్బీఐ కోరింది. దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపరిచామని, వాటిని మ్యాచ్ చేసి వివరాలు అందించేందుకు సమయం పడుతుందని, తమకు జూన్ 30 వరకు గడువు కావాలని కోరింది.
కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఎస్బీఐ ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపుతున్నదని, అందువల్ల బ్యాంకుపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ మరిన్ని ప్రత్యేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తాము వెల్లడించాలని ఆదేశించిన సమాచారం ఎస్బీఐ వద్ద సిద్ధంగా ఉన్నట్టు అది దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా తెలుస్తున్నదని, అందువల్ల గడువు కావాలన్న బ్యాంకు అభ్యర్థనను తోసిపుచ్చుతున్నామని కోర్టు స్పష్టం చేసింది.
12న బ్యాంకు పనివేళలు ముగిసేలోగా..
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎస్బీఐని ఆదేశించిన కోర్టు.. 2019, ఏప్రిల్ 12న పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు అమ్ముడుపోయిన బాండ్ల వివరాలను బయటపెట్టాలని పేర్కొంది. మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందించాల్సిందేనని స్పష్టం చేసింది. బ్యాంకు అందించిన సమాచారాన్ని క్రోడీకరించి, ఆ వివరాలను ఈ నెల 15న తమ అధికారిక వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులోఉంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేశామని ధ్రువీకరిస్తూ ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.
సుప్రీం తీర్పుపై విపక్షాల హర్షం
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన బీజేపీ.. తమ నిధుల రహస్యాలను దాచేందుకు అన్ని ప్రయత్నాలు చేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ కుతంత్రాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సుప్రీంకోర్టు ముందుకు మరోసారి వచ్చిందని కొనియాడింది. మోదీ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలు, అక్రమ లావాదేవీలు బయటపడటంలో ఇది తొలి అడుగు అని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎన్నికల విరాళాల్లో పారదర్శకతను నెలకొల్పడంలో సుప్రీంకోర్టు తీర్పు కీలకమైన పరిణామమని సీపీఎం పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. బీజేపీకి నిధులు ఇచ్చిన వారి జాబితా బయటకు వస్తుందని, అయితే ఆ పేర్లను బయటపెడతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిందని అన్నారు.
ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు?
ఎస్బీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే తన వాదనలు వినిపిస్తూ.. బ్యాంకు వద్ద దాతలు, గ్రహీతల వివరాలను ఆయా శాఖల వద్ద వేర్వేరుగా ఉన్నాయని వాటిని క్రోడీకరించడానికి, సరిపోల్చడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. ఈ సరిపోల్చే ప్రక్రియను పక్కన పెట్టినా.. ఇతర ప్రక్రియను పూర్తి చేయడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుందని అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. ‘ఏ దాత నుంచి ఏ గ్రహీత ఎంత తీసుకున్నారన్న వివరాలను మ్యాచ్ చేసి మేం చెప్పమనలేదు.
ఎన్ని బాండ్లను జారీచేశారన్న వివరాలను ఉన్నది ఉన్నట్టుగా ఈసీకి అందించాలని ఆదేశించాం. ఎస్బీఐ కేవలం తమ సీల్డ్ కవర్లను తెరిచి, వివరాలను క్రోడీకరించి, ఎన్నికల సంఘానికి అందజేయాలని మాత్రమే ఆదేశించాం’ అని పేర్కొంది. గత నెల 15న తాము ఇచ్చిన తీర్పు అమలుకు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కోరింది. ‘గత 26 రోజులలో ఏం చేశారు? మీరు గడువు కోరుతూ సమర్పించిన దరఖాస్తులో దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు లేవు’ అని నిలదీసింది. దీనికి హరీశ్ సాల్వే సమాధానమిస్తూ.. కోర్టు తీర్పు అనంతరం ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేశామని చెప్పారు.