న్యూఢిల్లీ: గడువు తేదీలోగా ఫీజు చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) కోరింది. డెడ్‌లైన్ లోగా దళిత విద్యార్థి అతుల్ కుమార్ తన ఫీజును డిపాజిట్ చేయలేకపోయాడు. దీంతో అతను తన అడ్మిషన్ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఆ దళిత విద్యార్థికి అండగా నిలిచింది. బీటెక్ కోర్సులో చేరిన యువ ప్రతిభావంతుడిని వదిలేయలేమని, అతన్ని పట్టించుకోకుండా ఉండలేమని కోర్టు తెలిపింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 విశేష అధికారాలను సుప్రీం వాడుకున్నది. అతుల్ కుమార్‌కు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బీటెక్ కోర్సులో చోటు కల్పించాలని కోరింది. జూన్ 24వ తేదీ లోగా 17,500 ఫీజును ఆ విద్యార్థి పేరెంట్స్ కట్టలేకపోయారు. సీటును బ్లాక్ చేసేందుకు కట్టాల్సిన ఫీజును చెల్లించకపోవడంతో విద్యార్థి భవిష్యత్తు అయోమయంలో పడింది. దీంతో అతని పేరెంట్స్ ఎస్సీ కమీషన్, జార్ఖండ్ లీగల్ అథారిటీని ఆశ్రయించారు.
అతుల్ కుమార్‌ది బీపీఎల్ కుటుంబం. అతని తండ్రి ఓ డెయిలీ కూలీ. యూపీలోని ముజాఫర్‌నగర్ జిల్లా అతనిది. ఎస్సీల జాతీయ కమీషన్ కూడా అతనికి హెల్ప్ చేయలేకపోయింది. ఐఐటీ మద్రాసు పరీక్ష నిర్వహించిన కారణంగా అతను మద్రాసు హైకోర్టును కూడా ఆశ్రయించాడు. హైకోర్టు సూచన మేరకు అతను సుప్రీంకోర్టుకెళ్లాడు.