న్యూఢిల్లీ: బీహార్లో ఓటర్ల జాబితా సవరణ తర్వాత సుమారు 65 లక్షల మంది ఓటర్లను లిస్టు నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే డిలీట్ చేసిన ఆ 65 లక్షల ఓటర్ల వివరాలను వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇవాళ సుప్రీంకోర్టు(Supreme court) ఆదేశించింది. ఆగస్టు 12 లేదా 13వ తేదీల్లో బీహార్ సిర్ ప్రక్రియపై సుప్రీంకోర్టులో మళ్లీ విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలో తొలగించిన ఓటర్ల వివరాలను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.
జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. డిలీట్ చేసిన ఓటర్ల వివరాలను ఇప్పటికే రాజకీయ పార్టీలకు సమర్పించారని, అయితే ఆ వివరాలను బహిరంగంగా వెల్లడించాలని, ఈ కేసులో పిటీషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్కు కూడా ఓ కాపీని ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. శనివారం లోగా రిప్లై నమోదు చేయాలని, ఏడీఆర్కు చెందిన ప్రశాంత్ భూషణ్ దాన్ని పరిశీలిస్తారని, అప్పుడు ఏ విషయాన్ని వెల్లడించాలి, వెల్లడించకూడదో తెలుస్తుందని బెంచ్ తెలిపింది.
డిలీటైన 65 లక్షల ఓటర్లు మరణించార లేక శాశ్వతంగా ఇండ్లు మారారా.. అన్న కారణాలు వెల్లడిస్తూ జాబితాను రిలీజ్ చేయాలని ఏడీఆర్ తన అప్లికేషన్లో కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. డిలీట్ చేసిన లిస్టులో ఉన్న కనీసం 15 మంది బ్రతికి ఉన్నట్లు నిరూపిస్తే, ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తామని కోర్టు చెప్పింది.