న్యూఢిల్లీ: ఆరావళి పర్వతాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనానికి తాము ఇచ్చిన ఆమోదాన్ని నిలిపివేస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. పర్యావరణ పరంగా పలు రాష్ర్టాలకు రక్షణ కవచంగా ఉన్న ఆరావళి పర్వతాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఆరావళి పర్వతాలకు ఇచ్చిన నిర్వచనానికి సంబంధించి కొన్ని కీలక స్పష్టీకరణలు అవసరమని పేర్కొంది. ఇందుకోసం నిపుణుల బృందంతో కూడిన ఒక కొత్త కమిటీని వేయాలని ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత రాష్ర్టాలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న పర్వతాలు మాత్రమే ఆరావళి పరిధిలోకి వస్తాయంటూ ఇటీవల కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్వచనానికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలపడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఆరావళి ప్రాంతంలో మైనింగ్ జోరందుకుంటుందని, కొద్ది సంవత్సరాలలోనే ఆ ప్రాంతమంతా ఎడారిగా మారిపోతుందని హెచ్చరించారు.