న్యూఢిల్లీ: మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్ డ్యూటీలు వేయరాదంటూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని దవాఖానలకు ఆదేశాలు ఇస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు మంగళవారం తప్పుబట్టింది. వారికి రక్షణ కల్పించాల్సి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కోల్‌కతా ఆర్జీ కర్ దవాఖానలో పీజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసును సుప్రీం కోర్టు విచారించింది. బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను వెంటనే సవరించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. ‘మహిళలు రాత్రి వేళ పనిచేయరని మీరెలా చెబుతారు? మహిళా వైద్యులకు ఎందుకు ఈ పరిమితులు? వారేమీ తమకు మినహాయింపు కావాలని కోరడం లేదు. రాత్రి షిఫ్ట్‌లలో కూడా పని చేయడానికి వారు సిద్ధం’ అని న్యాయస్థానం పేర్కొంది. వారికి భద్రతా చర్యలు కల్పించడంలోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. రాత్రి షిఫ్టుల్లో పనిచేయకుండా వారిని మీరు నిరోధించ లేరు. రాత్రి విధుల్లో ఉన్నప్పుడు వారికి భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రచూడ్ స్పష్టం చేశారు. కాగా, సోమవారం బెంగాల్ సీఎంతో జరిపిన చర్చల మేరకు చర్యలు తీసుకుంటే విధులకు హాజరవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జూనియర్ డాక్టర్లు కోర్టుకు స్పష్టం చేశారు.
సీబీఐ మధ్యంతర రిపోర్టులో పేర్కొన్న అంశాలు దిగ్భ్రాంతి గొలిపేవిగా ఉన్నాయని, అవి తమను కలవరపరిచాయని న్యాయస్థానం పేర్కొంది. అయితే అందులోని అంశాలను వెల్లడించడం సబబుగా ఉండదని, అది సీబీఐ దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. కీలక అంశాలపై ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని పేర్కొంది.
గత నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సోమవారం సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన ప్రధాన హామీ మేరకు ప్రభుత్వం మంగళవారం కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో మనోజ్ కుమార్ వర్మను నియమించారు. 1998 బ్యాచ్ అధికారి అయిన మనోజ్ కుమార్ ప్రస్తుతం అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్నారు. అలాగే మనోజ్ స్థానంలో చాలానాళ్లుగా కోల్‌కతా పోలీస్ కమిషనర్ స్థానం కోసం వేచి చూస్తున్న జావెద్ షమీమ్‌ను నియమించారు.