న్యూఢిల్లీ, జనవరి 28: దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని నిజమైన ప్రజా కోర్టుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అభివర్ణించారు. సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఏర్పడిన సెర్మోనియల్ బెంచ్‌లో సీజేఐ ప్రసంగిస్తూ.. 1950లో ఫెడరల్ కోర్టు స్థానంలో ఏర్పడిన సుప్రీంకోర్టు ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే అత్యంత చైతన్యవంతమైన, ప్రగతిశీలమైన అత్యున్నత న్యాయస్థానంగా రూపొందిందని ఆయన పేర్కొన్నారు. నిజమైన ప్రజా న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ప్రపంచంలోనే ఒక విశిష్ఠ స్థానాన్ని సంపాదించుకున్నదని తెలిపారు.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో 1950 జనవరి 26న సర్వోన్నత న్యాయస్థానం మనుగడలోకి వచ్చింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. మొదట్లో పాత పార్లమెంట్ హౌస్ నుంచి పనిచేసిన సుప్రీంకోర్టు 1958లో తిలక్ మార్గ్‌లోని ప్రస్తుత భవనంలోకి మారింది. తన రాజ్యాంగబద్ధ ప్రయాణాన్ని ప్రారంభించిన 75 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు మార్పు చెందినప్పటికీ తన స్థాపన లక్ష్యాన్ని నిలుపుకునే ఉన్నదని సీజేఐ మిశ్రా పేర్కొన్నారు. గడచిన 75 సంత్సరాలలో తన తీర్పుల ద్వారా రాజ్యాంగపరమైన ప్రమాణాన్ని సుప్రీంకోర్టు వాస్తవంగా మార్చిందని ఆయన తెలిపారు.