న్యూఢిల్లీ: 2022కు సంబంధించిన ఎన్డీఏ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా ఎన్డీఏలో మహిళా అభ్యర్థుల సంఖ్యను కేవలం 19 మందికే ఫిక్స్ చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ కోర్సులకు కేవలం 19 మంది అమ్మాయిలను మాత్రమే ఎంపిక చేయనున్నట్లు ఆ నోటిఫికేషన్లో స్పష్టంగా తెలిపారు. దీనిపై ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తాము ఆదేశాలు ఇచ్చినా.. ఎందుకు ఎన్డీఏలో మహిళా అభ్యర్థుల సంఖ్యను పెంచలేదని సుప్రీం అడిగింది. గత ఏడాది తరహాలోనే అదే సంఖ్యను ఎందుకు చూపించారని కోర్టు ప్రశ్నించింది.
2021లో ఎంత మంది మహిళా అభ్యర్థులు ఎన్డీఏ పరీక్షకు హాజరయ్యారో చెప్పాలని కేంద్రాన్ని కోర్టు కోరింది. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్ఐఎంసీ), రాష్ట్రీయ మిలిటరీ స్కూల్(ఆర్ఎంఎస్) కోసం ఎన్డీఏ పరీక్షను నిర్వహిస్తారు. అయితే మహిళా అభ్యర్థుల సంఖ్య అంశంపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదించారు.
యూపీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం.. 2022 ఏడాది కోసం 19 మంది మహిళలను ఎంపిక చేయనున్నారని, అయితే ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని కోర్టు అడిగింది. గత ఏడాది మౌళిక సదుపాయాలు లేవన్నారని, కానీ ప్రతిసారి 19 మందికే ఫిక్స్ కాలేము కదా అని కోర్టు పేర్కొన్నది. మూడు వారాల్లోగా ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఆర్మీకి పది మంది, నేవీకి ముగ్గురు, ఐఏఎఫ్‌కు ఆరు మంది మహిళా క్యాడెట్లను తీసుకోనున్నట్లు సీనియర్ అడ్వకేట్ శర్మ తెలిపారు.