Super Tech Twin Towers | నొయిడా పరిధిలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ పరిధిలో ప్రజలు ఆదివారం తమ ఇండ్ల నుంచి బయటకు రావద్దని నొయిడా అధారిటీ అధికారులు ప్రకటించారు. ఎడిఫైస్ ఇంజినీరింగ్ అండ్ జెట్ డిమాలిషన్స్ చట్ట విరుద్ధంగా నిర్మించిన ఈ ట్విన్ టవర్స్‌ను కూల్చేయాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల 22న ఈ టవర్స్ కూల్చివేతకు ముహూర్తం నిర్ణయించారు. అయితే, వాటి కూల్చివేతకు ఎంత మొత్తం పేలుడు పదార్థాలు అవసరం అవుతాయో అంచనావేసేందుకు నొయిడా అధారిటీ అధికారులు ఆదివారం టెస్ట్ బ్లాస్టింగ్ ద్వారా పరీక్షిస్తారు.
ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నొయిడా సెక్టార్ 93-ఏ సెక్టార్ పరిధిలోని ఈ టవర్స్‌ను ప్రయోగాత్మకంగా పేలుస్తారు. కనుక ఈ టైమ్‌లో టవర్స్ చుట్టుపక్కల నివాసం ఉంటున్న కుటుంబాలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు ఈ జోన్ పరిధిలోని అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వారు ఇంటి లోపలే ఉండి పోవాలని పేర్కొన్నారు. బాల్కానీల్లో కూడా నిలబడరాదని ఆదేశించారు.
పొరుగున ఉన్న ఏటీఎస్ గ్రీన్స్ విలేజ్, ఇతర సొసైటీల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా అలర్ట్ జారీ చేశారు. చట్ట విరుద్ధంగా నిర్మించిన ఈ టవర్స్‌లో 14వ అంతస్తు బేస్మెంట్ పరిధిలోని నాలుగు పిల్లర్లను పేల్చివేయనున్నట్లు వెల్లడించారు. సూపర్‌టెక్ అపెక్స్ (100 మీటర్లు), సెయానే (97 మీటర్లు) టవర్లను కూల్చేయాలని గతేడాది ఆగస్టు 31న నొయిడా అధారిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది.