Toor Dal | అప్పు చేసి కనీసం పప్పు కూడైనా తినాలి.. చికెన్, మటన్ తర్వాత సంగతి అంటుంటారు మన పెద్దలు. కానీ దేశంలో కేంద్రం అప్పుల మీద అప్పులు చేస్తున్నది. ఈ అప్పులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రజలకు కనీసం పప్పు కూడు కూడా పెట్టలేకపోతున్నది. ఇందుకు నిదర్శనమే దేశంలో నెలకొన్న కందిపప్పు కొరత. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో దేశంలోని పలు ప్రాంతాల స్టోర్లలో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. పరిమితంగా ఉండటంతో ధర అకాశాన్నంటుతున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): కందిపప్పు వాడకం లేని ఇల్ల్లు దేశంలో దాదాపుగా ఉండదు. ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఈ పప్పు వాడకం నెలకు ఒక్కో ఇంట్లో ఐదారు కిలోల వరకూ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ పప్పు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, కిరాణా దుకాణాల్లో కందిపప్పు స్టాక్ పరిమితంగా ఉన్నట్టు పలు రాష్ర్టాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో కందిపప్పు కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. కందిపప్పు డిమాండ్- సరఫరాపై కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ముందుచూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. కొరతను నివారించడానికి కందిపప్పుకు బదులుగా శనగపప్పు, ఎర్ర పప్పు, పెసర పప్పు తినాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
క్వింటాల్ కందికి రూ. 6,600 కనీస మద్దతు ధరగా (ఎమ్మెస్పీ) కేంద్రం నిర్ణయించింది. కానీ ప్రస్తుతం క్వింటాల్ కంది ధర రూ. 10,000- రూ.12,000 వరకు పలుకుతున్నట్టు హోల్‌సేల్ డీలర్లు చెబుతున్నారు. అకాల వర్షాలు, అధిక లాభం ఇచ్చే పంటల వైపునకు రైతులు మళ్లడం, డిమాండ్-సైప్లె అంతరంపై కేంద్రం ముందస్తుగా అంచనాలు వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు పలువురు చెబుతున్నారు. కిందటేడాది దేశంలో 43.4 లక్షల టన్నుల కందిపప్పు ఉత్పత్తి జరిగింది. మరో 15 లక్షల టన్నుల దిగుమతి జరిగింది. ఈ ఏడాది దిగుబడి 38.9 లక్షల టన్నులు దాటలేదు. అయినప్పటికీ కందిపప్పును దిగుమతి చేసుకోడానికి కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకోలేదని పరిశ్రమ నిపుణులు ఆరోపిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కందిపప్పునకు తీవ్ర కొరత ఏర్పడిందని, పరిమితంగా ఉన్న నిల్వలను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని మండిపడుతున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే భగ్గుమంటున్న కందిపప్పు ధర.. వానాకాలం పూర్తయ్యేనాటికి మరింత పెరగవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో కంది పప్పు రూ.140 వరకు ఉండగా.. రూ. 160-180కి పెరగొచ్చని అంటున్నారు. వేసవిలో కంది పప్పు వినియోగం తక్కువగానే ఉంటుందని కానీ వానాకాలంలో పెరుగుతుందని చెప్తున్నారు. అప్పుడు డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోతే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి వరకు హోల్‌సేల్ మార్కెట్లో రూ. 100 నుంచి రూ.103 వరకు ఉన్న కందిపప్పు ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ. 135 నుంచి 140 రూపాయల వరకు ఉన్నది.
తెలంగాణలోని తాండూరు, జహీరాబాద్, ఖమ్మం, సూర్యాపేటలో ఎక్కువగా కంది పండిస్తారు. కానీ ఈ ఏడాది రైతులు కందిపప్పుకు బదులుగా పత్తి, సోయాబిన్ తదితర పంటల వైపు మొగ్గు చూపడంతో కందిపప్పు దిగుబడి బాగా తగ్గిపోయింది. సాధారణ పరిస్థితుల్లో ముక్తియార్‌గంజ్, మహారాజ్‌గంజ్‌లలో ప్రతి నిత్యం దాదాపు 250 క్వింటాళ్ల వరకు కందిపప్పు అమ్మకాలు జరుగుతాయి. రానున్న రోజుల్లో ఇది 150-180 క్వింటాళ్లకు పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు వెల్లడించారు.
కొంతకాలంగా డిమాండ్‌కు తగినంతగా కందిపప్పు సరఫరా జరుగట్లేదు. మహారాష్ట్రలోని లాతూర్, సోలాపూర్, కర్ణాటక, ఏపీలోని అన్ని మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి. దీంతో ధర అమాంతం పెరిగిపోయింది. కొన్ని సూపర్ మార్కెట్లలో ‘నో స్టాక్ ’ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. 12 లారీల కందిపప్పును కొనాలనుకొన్న మిల్లర్‌కు ఒక్క లారీ కందిపప్పు కూడా దొరకట్లేదు.
– నితిన్‌బాయ్ వాణి, ప్రొడక్షన్ మేనేజర్, రెంటియో ఫుడ్
ఏటా ఈ సమయంలో గోదాముల్లో లక్షల టన్నుల్లో కందిపప్పు నిల్వలు ఉండేవి. అయితే, ఇప్పుడు అది వేలల్లోనే ఉన్నది. కంది కష్టాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో దీన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు.
– వృషీల్ పటేల్, లక్ష్మీ ప్రొటీన్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్