Superbugs | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సూపర్ బగ్స్ పెరుగుతుండటంతో సామాన్యులు చికిత్స కోసం కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తున్నదని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ వివరాలు అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ‘బీఎంజే ఓపెన్’లో ప్రచురితమయ్యాయి.
యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవులను సాధారణంగా ‘సూపర్‌బగ్స్’గా పిలుస్తారు.
మామూలు జ్వరానికి కూడా విరివిగా యాంటీబయాటిక్స్‌ను వాడటంతో సాధారణ బ్యాక్టీరియా, వైరస్లు కూడా రోగనిరోధకశక్తికి వ్యతిరేకంగా సులభంగా పోరాడగలిగే తర్ఫీదును పొందుతాయి. అప్పుడు చిన్న జ్వరానికి కూడా శక్తిమంతమైన మందులను వాడే పరిస్థితి వస్తుంది. అలాగే, పౌల్ట్రీ సెక్టార్లో కోళ్లు త్వరగా బరువు పెరుగడానికి, రోగాలపాలు గాకుండా కొందరు హానికరమైన యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు వాడుతున్నారు. అలాంటి మాంసాన్ని తినడం కూడా శరీరంలో సూపర్‌బగ్స్ శక్తిమంతంగా మారడానికి దారితీయొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.
సూపర్‌బగ్స్ కారణంగా సోకే వ్యాధులకయ్యే ఖర్చు మామూలు జ్వరంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోగనిరోధకశక్తిని పెంచడానికి శక్తిమంతమైన కొత్త మందులను ఇవ్వడంతో పాటు ఐసీయూలో చికిత్సనందించడమే దీనికి కారణంగా చెప్తున్నారు. సూపర్‌బగ్స్ చికిత్సకు దేశంలోని ఒక్కో ప్రైవేటు దవాఖానలో రూ. 3 లక్షల వరకు ఖర్చు పెట్టే సందర్భాలు కూడా ఉన్నట్టు వెల్లడించారు. దవాఖాన ఖర్చుల కోసం కొందరు తమ పొదుపు ఖాతాల్లోని డబ్బును వినియోగిస్తే, మరికొందరు అప్పులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంకొందరు స్థిర, చరాస్తులను తాకట్టు పెడుతున్నారని, మరికొందరు తమ దైనందిన అవసరాలను, ఆహారాన్ని తగ్గించుకొంటున్నట్టు తెలిపారు.