రాయ్పూర్ : వివాహిత మహిళల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం నుంచి బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోనీ లబ్ధిపొందుతున్నారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. అయితే, ఇక్కడో ట్విస్ట్ ఉంది. అక్కడి బీజేపీ ప్రభుత్వం ‘మహాతారి వందన్ యోజన’ పేరుతో వివాహితులైన మహిళల కోసం ఓ పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతినెల వారి ఖాతాలో నెలకు రూ. 1000 చొప్పున జమచేస్తున్నది. ఈ క్రమంలో బస్తర్ ప్రాం తంలోని తాలూర్ గ్రామానికి చెందిన వీరేంద్రజోషి.. సన్నీలియోని పేరిట ఆమె ఫొటో, పేరు, ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు గుడ్డిగా దానిని ఆమోదించారు. మనోడి పంట పండటంతో ప్రతినెల ఖాతాలో పడుతున్న రూ. 1000 తన జేబులో వేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో అతడిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై కలెక్టర్ హరీశ్ విచారణకు ఆదేశించారు. ఆ బ్యాంక్ ఖాతాను సీజ్ చేశారు. ఈ ఘటన అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.