Himachal Pradesh | ధర్మశాల, సెప్టెంబర్ 30: హిమాచల్‌ప్రదేశ్‌లో అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు వాటిని అమలుచేయలేక అల్లాడిపోతున్నది. ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించడానికి కూడా సతమతమవుతున్నది. గత నెలలో ఉద్యోగుల వేతనాలు ఐదు రోజులు, పెన్షనర్ల పింఛన్ 10 రోజులు ఆలస్యంగా చెల్లించిన సుఖ్విందర్ సుఖు సర్కారు.. సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లను అక్టోబర్ 9న చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో పెన్షనర్లు భగ్గుమన్నారు.
కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై హిమాచల్ ప్రదేశ్ పెన్షనర్స్ సంక్షేమ సంఘం తీవ్రంగా మండిపడింది. 9వ తేదీ కాదు ప్రతినెలా ఒకటో తేదీకి చెల్లించాల్సిందేనని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించింది. సవరించిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర ఎరియర్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. పెన్షనర్లు, ఉద్యోగుల కారణంగా ఖజానా ఖాళీ అవ్వడం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్పర్సన్లు, కార్యదర్శులు వనరులను దోపిడీ చేస్తున్నారని సీఎం సుఖ్విందర్ ప్రభుత్వంపై సంఘం అధ్యక్షుడు సురేశ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం వరుసగా రూ.1200 కోట్లు, 800 కోట్లు చెల్లించాల్సి ఉంది.