Suicide : అక్కతో వీడియో కాల్ మాట్లాడుతూ తమ్ముడు నది (River) లో దూకి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. వెంటనే అతని అక్క పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ దళం (DRF), అగ్నిమాపక దళం (Fire force) సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మృతదేహం లభ్యం కాకపోవడంతో ఇంకా గాలింపు కొనసాగుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన బాల్ కిషన్ అనే వ్యక్తికి సుమన్ అనే కుమార్తె, రితిక్ అనే కుమారుడు ఉన్నారు. సుమన్ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఉంటోంది. ఆమె తమ్ముడు రితిక్ కూడా అక్క దగ్గరే ఉంటూ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి యమునా నది బ్రిడ్జిపైకి వెళ్లిన రితిక్.. అక్క సుమన్‌కు వీడియో కాల్ చేశాడు.
తాను ప్రేమించిన అమ్మాయి తనను దూరం పెట్టిందని, తనకు జీవితంపై విరక్తి కలిగిందని, ఇక బతుకాలని లేదని చెప్పాడు. తాను నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. అక్క వద్దని వారిస్తుండగానే మొబైల్ ఫోన్‌ను రెయిలింగ్‌పై పెట్టి నదిలో దూకేశాడు. దాంతో అక్క సుమన్ వెంటనే సన్‌లైట్ కాలనీ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
దాంతో పోలీసులు ఇతర రెస్క్యూ టీమ్స్‌తో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. అయినా మృతదేహం లభ్యం కాకపోవడంతో ఇంకా సెర్చింగ్ కొనసాగుతోంది. ఘటన జరిగిన ప్రాంతంలో వంతెనపై రితిక్ బైకు, మొబైల్ ఫోన్ లభించాయని పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలం కావడమే ఆత్మహత్యకు కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.