న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ప్రజలకు బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. 40 ఏండ్లు పైబడిన వారికి అదనపు డోసు ఇవ్వడంపై పరిశీలించాలని ఇన్సాకాగ్ కూడా తాజాగా కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే, అర్హులకు ముందుగా పూర్తిస్థాయిలో డోసులను ఇచ్చాకే.. బూస్టర్ పంపకంపై యోచించాలని నిపుణుల బృందం ఒకటి అభిప్రాయపడుతున్నది. భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో అందరికీ వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయడం ముఖ్యమని పేర్కొంటున్నది. ఈ బృందంలో పుణెలోని ఐఐఎస్ఈఆర్లో ఇమ్యూనాలజిస్టుగా పనిచేస్తున్న వినీతా బాల్, ఢిల్లీ-ఎన్ఐఐ ఇమ్యూనాలజిస్ట్ సత్యజిత్ రత్, ముంబై వైద్యుడు వసంత్ నాగ్వేకర్ తదితరులు ఉన్నారు.