లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్పట్ జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లు టీచర్‌పై పగబట్టి, ఆయన భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గంగ్నౌలీలోని ఓ మసీదు ప్రాంగణంలో స్థానిక బాలలకు ముఫ్తి ఇబ్రహీం మతపరమైన విద్యను బోధిస్తూ ఉంటారు. ఆయన చేత దెబ్బలు తిన్న ఇద్దరు మైనర్లు ఆయనపై పగ పెంచుకున్నారు. వీరిద్దరూ ఓ సుత్తి, ఓ కత్తి తీసుకుని, ఆయన ఇంట్లో లేని సమయంలో, ఆయన భార్య ఇస్రానా, కుమార్తెలు సోఫియా (5), సుమైయా (2)లను దారుణంగా హత్య చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిందితులిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.
భోపాల్: బీజేపీపాలిత మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఓ ఇంజినీరింగ్ విద్యార్థిపై తమ ప్రతాపాన్ని చూపారు. స్నేహితులతో బీర్ తాగుతూ కనిపించిన 22 ఏండ్ల విద్యార్థిని లాఠీలతో ఇష్టమున్నట్టు బాదారు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో స్నేహితులతో ఆ పార్టీ చేసుకుంటున్నానని చెప్పినా..వారు వినలేదు. విద్యార్థి బట్టలు విప్పించి, మర్మాంగాలపై కర్రలతో కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. రూ.10 వేలు ఇవ్వాలంటూ కానిస్టేబుల్స్ తొలుత డిమాండ్ చేశారని, అయితే వారి డిమాండ్ నెరవేరకపోవడంతో బాధిత విద్యార్థి ప్రాణాలు బలిగొన్నారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటన గత గురువారం భోపాల్‌లోని ఇంద్రపురిలో చోటుచేసుకుంది. దారుణానికి పాల్పడ్డ పోలీసు కానిస్టేబుల్స్‌కు మరణ శిక్ష విధించాలని ఉదిత్ తండ్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పట్నా: బీజేపీ పాలిత బీహార్‌లో ఓ వ్యక్తి మూడో పెండ్లికి సిద్ధపడగా..ఇందుకు అడ్డుపడుతున్న రెండో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. రెండో భార్య ఒంటిపై పెట్రోల్ పోసి, ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ వదిలిపెట్టి..నిప్పు అంటించాడు. కొద్ది రోజుల క్రితం నలందా జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన మొదటి పెండ్లి విషయాన్ని దాచిపెట్టి సునీతాదేవి అనే యువతిని నిందితుడు వికాస్కుమార్ ఐదేండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.
భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలిపే ఉదంతమిది. దామో జిల్లా సటారియా గ్రామంలో బ్రాహ్మణ యువకుడిని అవమానించాడంటూ ఓబీసీ కులానికి చెందిన యువకుడి పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. ఓబీసీ యువకుడితో బలవంతంగా బ్రాహ్మణ యువకుడి కాళ్లు కడిగించి, ఆ నీటిని తాగించారు. అంతేగాక రూ.5,100 జరిమానా కూడా విధించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికంటే ముందు..బ్రాహ్మణుడైన అన్నూ పాండేకు చెప్పుల దండ వేసి ఊరేగించారంటూ ‘ఏఐ ఇమేజ్’ను పురుషోత్తమ్(ఓబీసీ యువకుడు) సృష్టించటం గ్రామంలో రెండు కులాల మధ్య చిచ్చుకు దారి తీసింది. పై ఘటనకు మూల కారణమైంది.