చెన్నై: కొందరు విద్యార్థులు టీచర్‌పై కోపాన్ని వింతగా ప్రదర్శించారు. తరగతి గది తాళాలకు మానవ మలాన్ని పూశారు. ఇది చూసి టీచర్లు, స్టూడెంట్లు షాక్ అయ్యారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు (students detained). తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల19న తిరుత్తణిలోని మాథూర్‌లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చారు. అయితే మూసి ఉన్న క్లాస్ రూమ్ లాక్‌లకు మానవ మలం పూసి ఉండటం చూసి షాకయ్యారు. దీంతో విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లలేకపోయారు. వారంతా స్కూల్ ఆవరణలో బైఠాయించారు.
కాగా, స్టూడెంట్స్, టీచర్లతోపాటు ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఈ సంఘటనపై నిరసన తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు జరిపారు. 12వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులను అనుమానించి వారిని ప్రశ్నించారు. ఇద్దరు విద్యార్థులు తాము చేసినట్లు ఒప్పుకున్నారు. ఒక ఉపాధ్యాయుడిపై కోపంతో ఇలా చేసినట్లు చెప్పారు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.