Foreign Education | ముంబై, ఫిబ్రవరి 27: విదేశాల్లో చదువుకోవాలనే కల నెరవేర్చుకోవడం రోజురోజుకూ కష్టంగా మారుతున్నది. ఒకవైపు పతనమవుతున్న రూపాయి విలువ, మరోవైపు కఠినమవుతున్న వీసా నిబంధనలతో విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. చదువు పూర్తి చేసుకొని డాలర్లు సంపాదించడం దేవుడెరుగు.. చదువుకునేందుకు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడం కూడా కష్టమవుతున్నది. మరోవైపు విదేశాల్లో పిల్లల ఖర్చుల కోసం ఇక్కడి నుంచి డబ్బులు పంపే తల్లిదండ్రులపైనా భారం పెరుగుతున్నది.
డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ వేగంగా పడిపోతున్నది. దీంతో విదేశీ విద్యకు ఫీజులు, ఇతర ఖర్చులకు వెచ్చించాల్సిన విలువ మన కరెన్సీలో పెరిగిపోతున్నది. గత ఆరు నెలల్లో రూపాయి విలువ 5 శాతం పడిపోయింది. గత ఆగస్టులో 83.5 ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 87.2కు పడిపోయింది. ఉదాహరణకు విదేశీ విద్య ఫీజులు, ఖర్చుల కోసం కోటి రూపాయలు ఖర్చయ్యే చోట ఇప్పుడు రూ.5 లక్షలు అధికం అవుతున్నది. దీంతో విద్యార్థులపై స్టడీ లోన్ల భారం పెరుగుతున్నది. పిల్లలకు డబ్బులు పంపే తల్లిదండ్రులదీ ఇదే పరిస్థితి. గతంలో అమెరికాలోని తన కూతురికి నెలకు 900 డాలర్లు పంపేదానినని, ఇప్పుడు 800 డాలర్లు మాత్రమే పంపగలుగుతున్నానని ముంబైకి చెందిన సుధా పై తెలిపారు.
చదువు పూర్తయ్యాక విదేశాల్లోనే ఉద్యోగాలు చూసుకొని రుణాన్ని చెల్లించడంతో పాటు నాలుగు డాలర్లు కూడబెట్టుకోవాలనేది భారతీయ విద్యార్థుల ఆలోచన. అయితే, ఇటీవల అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేశాయి. దీంతో చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు పొందడం కష్టంగా మారుతున్నది. విదేశీ గ్రాడ్యుయేట్లు యూకేలో రెండేండ్లు అదనంగా నివసించాలంటే 36-40 వేల పౌండ్ల నడుమ వేతనాలు ఉండే ఉద్యోగాలు పొందాలని యూకే కొత్త నిబంధన తెస్తున్నది. భారతీయ విద్యార్థులకు కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తున్నది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరకకపోయినా, వీసా నిబంధనల వల్ల పని చేయడం కుదరకపోయినా విద్యార్థులు ఆర్థికంగా మరింత కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.