తిరువనంతపురం: పాఠశాల విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులు గుట్టుగా గంజాయిని సేకరించారు. ఎక్సైజ్ కార్యాలయాలన్ని వర్క్‌షాప్‌గా పొరబడి లోపలకు వెళ్లారు. (Kerala Students) గంజాయితో కూడిన బీడీలను కాల్చేందుకు అగ్గిపెట్టె కోసం అక్కడి సిబ్బందిని అడిగారు. అయితే అక్కడున్న వారు పోలీసులని గ్రహించి పారిపోయేందుకు స్టూడెంట్లు ప్రయత్నించారు. షాకైన ఎక్సైజ్ సిబ్బంది వెంటపడి ఆ విద్యార్థులను పట్టుకున్నారు. విస్తూపోయే ఈ సంఘటన కేరళలో జరిగింది. త్రిసూర్‌లోని ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులు తమ టీచర్లతో కలిసి ఇడుక్కి జిల్లాలోని ఆదిమాలికి విహారయాత్ర కోసం వచ్చారు.
కాగా, సోమవారం మధ్యాహ్నం విద్యార్థులంతా ఒక హోటల్లో భోజనం చేశారు. అయితే గంజాయితో కూడిన బీడీలు కాల్చాలని కొందరు విద్యార్థులు భావించారు. అక్కడున్న ఎక్సైజ్ కార్యాలయాన్ని వర్క్‌షాప్‌గా పొరపాటుబడ్డారు. లోనికి వెళ్లిన ఆ స్టూడెంట్స్ అక్కడున్న ఎక్సైజ్ సిబ్బందిని అగ్గిపెట్టె అడిగారు. అయితే వారు పోలీసులని గ్రహించిన వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగెత్తారు.
మరోవైపు షాక్ నుంచి తేరుకున్న ఎక్సైజ్ సిబ్బంది ఆ విద్యార్థుల వెంటపడి వారిని పట్టుకున్నారు. ఇద్దరు బాలుర వద్ద ఉన్న గంజాయి, హషీష్ ఆయిల్ వంటి నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా స్టూడెంట్స్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి టీచర్లకు అప్పగించారు. డ్రగ్స్ లభించిన మైనర్ బాలురపై కేసు నమోదు చేశారు. వారి తల్లిదండ్రులను అక్కడకు పిలిపించారు.
కొందరు స్టూడెంట్స్ డబ్బులు పొగుచేసి గంజాయి, హషీష్ ఆయిల్ వంటి నిషేధిత పదార్థాలను సమకూర్చుకున్నారని ఎక్సైజ్ శాఖ అధికారి తెలిపారు. ఆ విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.