న్యూఢిల్లీ : తరగతి గదుల నుంచి విద్యార్థులు బయటకొస్తున్నారు. తమ స్కూల్ గేట్ల ముందు నిలబడి నినాదాలు చేస్తున్నారు. బీహార్ నుంచి తమిళనాడు దాకా.. రాజస్థాన్ నుంచి పశ్చిమబెంగాల్ దాకా విద్యార్థుల నినాదాలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ర్టాలు మారితే భాష మారుతున్నది గానీ.. వారి డిమాండ్లు మాత్రం ఒక్కటే. ‘హమారా స్కూల్ ఠీక్ కరో’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పాడుబడ్డ భవనాలు, అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లు, సరిపోని బెంచీలు, నమ్మకం లేని మంచినీళ్లు, ఉపాధ్యాయుల కొరత ఇలా ఎన్నో సమస్యలపై వారు గొంతెత్తి నినదిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆగస్టు 15 నుంచి స్కూల్ ఠీక్ కరో కార్యక్రమాన్ని మొదలు పెట్టడంతో.. ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిర్వహించిన ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. చివరకు విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దాంతో సీజేపీ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు లభిస్తున్నది.
స్వతంత్ర భారతంలో పాఠశాలల దుస్థితి..
ఆగస్టు 11న అభిజీత్ దీప్కే ‘హమారా స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమాన్ని ప్రకటించి 15న తన సొంత గ్రామం సంతుక్ పింప్రిలో ప్రారంభించారు. స్కూల్లో ఉన్న సాధారణ సమస్యలన్నింటినీ మీడియా ముందు ఉంచారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లు అవుతున్నా పాఠశాలల దుస్థితి ఏమీ మారలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని, ప్రధాని ఇల్లును కడుతున్నప్పుడు విద్యార్థుల కోసం పాఠశాలల బిల్డింగులు ఎందుకు కట్టించట్లేదని ప్రశ్నించారు. రైతులు, కూలీల పిల్లలు ఈ దేశ భవిష్యత్తు కాదని ప్రధానమంత్రి అనుకుంటున్నారా అని అభిజీత్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉద్యమాలు..
అన్ని రాష్ర్టాల్లో స్కూల్ ఠీక్ కరో ఉద్యమం విస్తరిస్తున్నది. సీజేపీ ప్రారంభానికి ముందు నుంచే ఈ ఉద్యమం అనేక రాష్ర్టాల్లో ఉవ్వెత్తున ఎగసింది. జూలై 27న ఫతేపూర్‌లోని సర్వోదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతపై నిరసన తెలిపారు. చివరకు స్కూల్ యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లా చందుపూర్ గ్రామానికి చెందిన సుమార్ 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్లారు. పాఠశాలకు పక్కా రోడ్డు వేయాలంటూ డిమాండ్ చేశారు. లక్నోలోని జై ప్రకాశ్ నారాయణ సర్వోదయ విద్యార్థులు టీచర్ల కొరతపై బుద్ధేశ్వర్ కూడలిలో రోడ్డుపై నిరసనకు దిగారు. బీహార్‌లోని గయా జిల్లాలో సిమువారా పాఠశాల విద్యార్థులు మౌళిక సదుపాయాల కోసం రోడ్ల మీదికొచ్చి భారీ ధర్నా నిర్వహించారు. ఫ్యాన్లు పనిచేయట్లేదని, హ్యాండ్ పంపులు పాడయ్యాయని, బెంచీలు లేవని 50 మంది విద్యార్థులు ఎస్డీఎమ్ కార్యాలయం ముందు నిరసన తెలిపడంతో అధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ప్రభుత్వ పాఠశాలలను విలీనాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది బాలికలు రోడ్ల మీదికొచ్చి నిరసన తెలిపారు. చండీగఢ్‌లోని వందలాది మంది మూగ, బధిర విద్యార్థులు రోడ్లమీదికొచ్చి నిరసన తెలిపారు.
తమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, టీచర్లను నియమించాలంటూ డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని జై ప్రకాశ్ నారాయన్ సర్వోదయ విద్యాలయ పాఠశాల బాలికలు సుమారు 200 మంది నిరసనలు తెలుపుతూ రోడ్లమీదికొచ్చారు. లక్నో-దుబ్బాగ బైపాస్ మీద వారంతా బైఠాయించారు. పాఠశాలలో టీచర్ల కొరత ఉందని, ఆహారంలో నాణ్యత లేదని పేర్కొన్నారు. దాదాపు రెండు గంటల పాటు వానలో తడుస్తూనే బాలికలు నిరసన తెలిపారు. తమిళనాడులోని కొడవలి గ్రామ ప్రజలతో కలిసి విద్యార్థులు మద్యం షాపును అక్కడి నుంచి తరలించాలంటూ నిరసన తెలిపారు. కర్ణాటకలోని బిదాడిలో రైతులు తమ భూముల పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమానికి విద్యార్థులు మద్దతు తెలిపారు. ఆ ప్రాంతంలోని 9,600 ఎకరాల్లో ఏఐ సిటీ, డాటా సెంటర్లు తీసుకొస్తే 10 లక్షల చెట్లు నరికివేయాల్సి వస్తుందని.. పర్యావరణానికి ప్రమాదం అంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. ఆగస్టు 14న సీజేపీ సహ కన్వీనర్ అశుతోష్ రంకా నేతృత్వంలో సుమారు 50 మంది కార్యకర్తలు, జోధావాస్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు, స్థానిక ప్రజలు కలిసి నిరసన తెలిపారు. ఈ పాఠశాలలో కొన్ని రోజుల కింద పైకప్పు కూలిపోయింది. ఆరుగురు సీనియర్ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయని అషుతోష్ చెప్పారు. రాజస్థాన్‌లో సుమారు 84వేల తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయని.. 15 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రతిఘటనలు..
రాజస్థాన్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తామని సీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి బయటి వ్యక్తులు ఎవరూ ప్రభుత్వ స్కూళ్లలోకి రావొద్దని, ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 16న బెంగాల్‌లోని బంకురా జిల్లాకు చెందిన వాలంటీర్‌పై బీజేపీ వ్యక్తులు దాడి చేశారని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా ఆరోపించారు. ఇండస్ బ్లాక్‌లోని ఒక పాఠశాలను తనిఖీ చేసిన తర్వాత వాలంటీర్ అబ్దుల్ హఫీజ్ ఇంటికి చేరుకున్న వెంటనే కొంతమంది వ్యక్తులు అతన్ని కొట్టారని అశుతోష్ తెలిపారు. ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన హఫీజ్ తండ్రి జనాబ్ మఫిక్ తీవ్రంగా గాయపడి మరణించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్‌కు న్యాయం జరిగే వరకు అక్కడే ఉండి పోరాడుతామని అశుతోష్ వెల్లడించారు.