న్యూఢిల్లీ : వీధుల్లో తినుబండారాలను విక్రయించేవారి వద్ద సంవత్సరానికి ఒకసారి వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100ను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఎఫ్ఎస్ఎస్ఏఐని ఆదేశించారు. దేశవ్యాప్తంగా స్ట్రీట్ ఫుడ్ హబ్స్‌ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసం నిర్వహించిన శిక్షణ, అవగాహన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం సంవత్సరానికి రూ.12 లక్షల వరకు టర్నోవరు కలిగిన చిన్నతరహా ఆహార పదార్థాల వ్యాపారుల వద్ద ఏడాదికి రూ.100 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజును ఎఫ్ఎస్ఎస్ఏఐ వసూలు చేస్తున్నది. ఈ వ్యాపారులకు సర్టిఫికేట్లను, ‘స్ట్రీట్ సేఫ్’ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఎఫ్ఎస్ఎస్ఏఐ అందిస్తున్నది.