చెన్నై: హిందీ భాషా వికాసానికి ఉద్దేశించిన కాషాయ విధానంగా జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఉత్తరాది రాష్ర్టాలలో గెలుపొంది తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బుధవారంనాడిక్కడ ఓ బహిరంగ సభలో స్టాలిన్ ప్రసంగిస్తూ తమకు ప్రాబల్యం ఉన్న రాష్ర్టాలలో ఎంపీ సీట్లను పెంచుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. తమిళనాడు విద్యా ప్రగతిని పూర్తిగా నాశనం చేసే ఎన్ఈపీని తాము వ్యతిరేకిస్తామని అన్నారు.