Mamata Benerjee : పశ్చిమ బెంగాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు విసిరారనే వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. హౌరా – న్యూ జల్పైగురి మధ్య వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు విసిరింది బిహార్‌లో. మా రాష్ట్రంలో కాదు అని ఆమె అన్నారు. అంతేకాదు ఈ ఘటనతో సంబంధం లేకున్నా కూడా తమ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మమతా తెలిపారు. తమ రాష్ట్రానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రానందుకు బహుశా బిహార్ ప్రజలు కోపంతో ఉండి ఉంటారు. ఎందుకంటే.. వాళ్లు బీజేపీతో లేరు కాబట్టి అని మమతా వెల్లడించారు. అంతేకాదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేకత ఏం లేదని అన్నారు. పాత రైలుకు మార్పులు చేసి, కొత్త ఇంజిన్ పెట్టారని మమత వెల్లడించారు.
హౌరా- న్యూ జల్పైగురి ఎక్స్‌ప్రెస్‌పై జనవరి 3న కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో రెండు బోగీల అద్దాలు పగిలిపోయాయి. పశ్చిమబెంగాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈమధ్యే హౌరా- న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ముంబై, గుజరాత్లో పోయిన ఏడాది రెండు రైళ్లు పశువులను ఢీకొట్టాయి.