లక్నో: మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాటికాయ సైజున్న రాతి బంతులను చాలా ఏండ్లుగా కొందరు గ్రామస్థులు కులదేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తూ పూజిస్తున్నారు. ఇటీవల ఆ ప్రాంతాలను సందర్శించిన పరిశోధకులు అనుమానంతో పరీక్షలు జరుపగా షాకింగ్ నిజాలు తెలిశాయి. వారు ఇన్నాళ్లూ పూజలు జరుపుతున్నది డైనోసార్ శిలాజ గుడ్లుగా నిర్ధారించారు.
ధార్, దానికి సమీపంలో ఉన్న జిల్లాల్లో పొలం దున్నేప్పుడు, ఇతర తవ్వకం పనులు చేసేటప్పుడు లభించే ఈ రాతి బంతులను కొందరు దైవంగా భావించి పూజిస్తున్నారు. ఈ బంతులను కాకర్ భైరవ్‌గా పూజిస్తున్నట్టు పండ్యాల గ్రామానికి చెందిన వెస్టా మండాలోయ్ (40) తెలిపారు. రాతి బంతులను లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసెన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధించగా, డైనోసార్ టైటనాసార్ జాతికి చెందిన శిలాజ గుడ్లుగా తేలింది.