Double Engine Government | న్యూఢిల్లీ, జూన్ 25: కొన్నేండ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రయోగిస్తున్న ప్రధాన ప్రచార అస్త్రం ‘డబుల్ ఇంజిన్ సర్కార్’. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఊదరగొడుతున్నది. కానీ, వాస్తవంగా చూస్తే డబుల్ ఇంజిన్ ప్రయోగం ఘోరంగా విఫలమైంది. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రమే అందుకు నిదర్శనం. జాతుల మధ్య ఘర్షణలతో అక్కడ శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. శాంతిభద్రతలను కాపాడటమే ప్రభుత్వాల ప్రధాన విధి… అందులోనే బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ర్టాన్ని కాపాడలేకపోయింది.
రాష్ర్టాల నోటికి తాళం…
డబుల్ ఇంజిన్ ప్రయోగం వెనుక ఆర్థిక అంశాల కంటే రాజకీయ ప్రయోజనాలే అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. రాష్ర్టానికి పన్నుల వాటాలో కోత పెట్టినా, నిధులు ఇవ్వకున్నా డబుల్ ఇంజిన్ సర్కార్లకు రాష్ట్ర ప్రభుత్వాలు వంత పాడుతున్నాయి. మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కార్లో రాష్ట్ర నాయకులు చేస్తున్న అవినీతి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కేంద్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నది.నిధులు, హక్కుల కోసం కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.