NDA | న్యూఢిల్లీ, జనవరి 22: రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో వైస్ చాన్స్లర్ల నియామకంలో గవర్నర్లకు అపరిమిత అధికారాలను కట్టబెడుతూ, రాష్ర్టాల అధికారాలకు కత్తెర వేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చేసిన ప్రతిపాదనలపై విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీలు సైతం అసంతృప్తిని తెలియజేశాయి. ఇది సమాఖ్య వాదానికి, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిరంకుశంగా ఉందని ఆరోపించాయి.
యూజీసీ ముసాయిదా నిబంధనలు-2025ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ దృష్టికి తేనున్నట్టు జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ చెప్పారు. ఈ పరిణామంపై ఎన్డీఏలో మరో కీలక మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్తి ఉన్నట్టు తెలిసింది. అయితే దీనిపై ఆ పార్టీ ఆచితూచి స్పందించింది. తాము యూజీసీ ముసాయిదాను చూశామని, తమ అధి నాయకత్వం ప్రస్తుతం దావోస్లో ఉన్నందున దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. యూజీసీ తాజా ముసాయిదాలో ఏమైనా లోపాలు, అభ్యంతరాలు ఉన్నా, దానిని బహిరంగంగా ప్రకటించమని, దీనిని రాజకీయం చేసే ఉద్దేశం తమకు లేదని, సంబంధిత వ్యక్తులతోనే అంతర్గతంగా దీనిపై చర్చిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి దీపక్ రెడ్డి తెలిపారు.
ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని ఎన్డీఏ మరో భాగస్వామ్య పార్టీ ఎల్జేపీ (రామ్ విలాస్) ఉపాధ్యక్షుడు ఏకే బాజ్పాయ్ పేర్కొన్నారు. ఇది విపక్షాలు అధికార పార్టీల హక్కులను హరించడమేనని కేరళ ప్రభుత్వం మండిపడింది. యూజీసీ కొత్త నిబంధనలను వెంటనే రద్దు చేయాలని మంగళవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఉన్నత విద్యను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న సంఘ్ పరివార్ అజెండాలో భాగంగానే దీనిని ప్రవేశపెట్టినట్టు ఆరోపించింది. యూజీసీ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ ఈనెల ఆరంభంలోనే ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసింది.