పుణె: మహారాష్ట్రలోని పుణెలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్‌ను పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన నిందితురాలు సియా గోయెల్ అతనిని ఎలా చంపాలనే దానిపై తన ప్రియుడు చేతన్ చౌదరి సాయంతో ఆన్లైన్లో వెదికినట్టు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. తనకు ఇష్టంలేదని చెప్పినా, ఇంట్లోని వారు వినకపోవడంతో సియా ఈ వివాహానికి అంగీకరించిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వీరి వివాహం కోసం ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరగ్గా, నవంబర్‌లో వివాహం నిశ్చయించారు.
పోలీసులు తమ దర్యాప్తులో చేతన్, సియాల ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపారు. దీనిలో వారు ఆన్లైన్లో ఒక వ్యక్తిని చంపేందుకు గల మార్గాలను అన్వేషించారని తేలింది. కాగా ఈ కేసులో న్యాయస్థానం నిందితులిద్దరికీ ఏడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. గత ఏడాది నవంబర్ నుంచి సియా- చేతన్ రిలేషన్లో ఉన్నారని పోలీసులు గుర్తించారు.