ఇంఫాల్, డిసెంబర్ 18: మణిపూర్‌లో ఇటీవల తిరుగుబాటుదారు సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ పరికరాలు కూడా ఉండటం భద్రతా దళాలను ఆశ్చర్యపరిచాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఈ నెలలో తిరుగుబాటు గ్రూపులు రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్పీఎఫ్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లపై జరిపిన దాడిలో రైఫిళ్లు, పిస్తోళ్లు, గ్రనేడ్లతో పాటు ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్‌మస్క్ కంపెనీకి చెందిన స్టార్‌లింక్ పరికరాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మస్క్‌కు చెందిన స్టార్ లింక్ ప్రపంచంలోని ఏ మూలకైనా ఉపగ్రహ వ్యవస్థతో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అయితే ఈ సంస్థ కార్యకలాపాలకు భారత్‌లో ఇంకా అనుమతి రాలేదు. కాగా, దీనిపై మస్క్ స్పందిస్తూ ఈ ఆరోపణలన్నీ అబద్ధమని, స్టార్‌లింక్ శాటిలైట్ బీమ్‌లు భారత్‌లో నిలిపివేసి ఉన్నాయని, దాని ద్వారా ఇంటర్నెట్ వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు.