DMK-Congress : ఈ ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త పొత్తులు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటిదాకా కలిసున్న పార్టీలు దూరమయ్యే అవకాశాలున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పని చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
దీనికి కారణం కాంగ్రెస్ ప్రతిపాదనే అని తెలుస్తోంది. సీట్ల షేరింగ్ తోపాటు, అధికారంలో కూడా భాగస్వామ్యం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనికి డీఎంకే అంగీకరించలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే పొత్తు ఉండకపోవచ్చని తమిళనాడు మంత్రి పెరియసామి తెలిపారు. అధికారాన్ని పంచుకునేందుకు తమ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ సిద్ధంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత మాణిక్కం ఠాగూర్ తమకు అధికారంలో వాటా కావాలని అడిగినా ఇందుకు డీఎంకే సానుకూలంగా స్పందించలేదు.
పైగా తమిళనాడులో 1967 నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఒంటరిగానే గెలిచాయని పెరియసామి అన్నారు. 2006లో డీఎంకే.. ఇతర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టినప్పటికీ.. ఇతర పార్టీల నేతలకు మంత్రివర్గంలో చోటు మాత్రం కల్పించలేదు. తమిళనాడుకు సంబంధించి మద్రాస్ రాష్ట్రంగా ఉన్న సమయంలో, 1952-57 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే, మెజారిటీ లేని కారణంగా అప్పుడు మాత్రమే నాన్ కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవులు దక్కి, ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. మిగతా ఎప్పుడూ తమిళనాడులో ఇతర పార్టీలు ప్రభుత్వంలో ఉన్నా.. మంత్రివర్గంలో చోటు మాత్రం దక్కలేదు.
ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీచేసినా సరే.. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వడానికి డీఎంకే సిద్ధంగా లేదు. మరోవైపు.. నటుడు విజయ్ స్థాపించిన టీవీకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే మార్చి-ఏప్రిల్ లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.